Friday, May 4, 2018

సంధ్యావందనము, గాయత్రి మంత్ర విశిష్టత

మహాభారతం, అశ్వమేధిక పర్వంలో, ధర్మరాజు కోరికపై శ్రీకృష్ణ భగవానుడు, *'సంధ్యావందనము, గాయత్రి మంత్ర'* విశిష్టతను ఈవిధంగా వివరించారు.
'ప్రతినిత్యం ప్రాతఃకాలం, సాయంకాలం చక్కగా సంధ్యావందనము చేసేవారు వేదమయమైన నావను నిర్మించి తాము దానితో తరిస్తారు, ఇతరులను తరింపచేస్తారు. పవిత్రమైన గాయత్రిమాతను జపించేవ్యక్తి నాలుగు సముద్రాల చుట్టూ గల భూమిని అంతనూ దానంగాతీసుకున్నా ప్రతిగ్రహదోషంచేత దుఃఖితుడుకాడు. ఆకాశంలో ఉండేకొన్ని గ్రహాలు అనిష్టస్థానాలలో ఉండి, అనిష్టదాయికాలయినాకూడా గాయత్రి జప ప్రభావంచేత సౌమ్యములు, మంగళకరములు, శుభదాయకములవుతాయి. భయంకరమైన పిశాచములు కూడా ఆ బ్రాహ్మణునికి అనిష్టం కలిగించలేవు.
వేదవ్రతాచరణంగల పురుషులు భూమిమీద ఇతరులను కూడా పవిత్రులను చేయగలరు. ఆ గాయత్రిమాత నాలుగు వేదాలకన్నా కూడా శ్రేష్ఠమైనది. బ్రహ్మచర్యాన్ని అనుష్టించనివారు,  వేదాధ్యయనంచేయనివారు, దుష్ట ఫలాలనిచ్చే కర్మలనాచరించే నామమాత్రపు బ్రాహ్మణులయినా గాయత్రీ ప్రభావంచేత పూజ్యులవుతారు. అటువంటప్పుడు ప్రాతః సాయం సంధ్యావందనము నిత్యం చేసేవారిగురించి వేరే చెప్పేదేముంది.
శీలం, వేదాధ్యయనము, దానం, పవిత్రత, కోమలత్వము, సారళ్యం అనే సద్గుణాలు బ్రాహ్మణునికి వేదంకన్నా మిన్న.
*'భూః భువః సువః'* అనే మూడు  వ్యహృతులతో గాయత్రి మంత్ర జపము చేసేవారు వేదాధ్యయనము నిరతులే. ప్రతి నిత్యం సంధ్యావందనము చేసే ఉత్తమ ద్విజుడు బ్రహ్మలోకానికి వెడతారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
పూర్వం బ్రహ్మదేవుడు,  దేవతలు, ఋషిగణాలు అందరూ కలసి త్రాసులో ఒకవైపు గాయత్రి మంత్రమును, మరొకవైపు నాలుగు వేదాలను ఉంచి తూచారు. నాలుగు వేదాలకన్నా కూడా గాయత్రి మంత్రమే బరువైనదని నిరూపితమయ్యింది. సర్వవేదాలకు గాయత్రి మంత్రమే ప్రాణం. గాయత్రి రహితమైన వేదాలు నిర్జీవాలు.
నియమసదాచార భ్రష్టుడైన బ్రాహ్మణుడు నాలుగు వేదాలు చదివినా వింధ్యుడవుతాడు. సచ్ఛీలం సత్ప్రవర్తన కలిగి గాయత్రి మంత్రం మాత్రమే చేసే బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు.
ప్రతిదినమూ సహస్ర గాయత్రి మంత్ర జపము శ్రేష్టం, శతజపం మధ్యమం, దశగాయత్రీ జపము అధమం అవుతాయి.
*ప్రతినిత్యం ప్రాతః సాయం సంధ్యావందనమున శతగాయత్రి జపము ఆచరించిన గ్రహప్రతికూలముండదు. పురశ్చరణగా అక్షరలక్ష జపమున గ్రహములనుకూలవర్తులగుదురు. అక్షరకోటి జపమున సర్వగ్రహములు వారి ఆధీనమగును.*
గాయత్రి మంత్ర ప్రభావమునెంతచెప్పిననూ తక్కువే యుధిష్టరా!
*సకాలమైననూ, కాలాతీతమైననూ సంధ్యనాచరించే ద్విజుడు నాకు మిక్కిలి ప్రీతి పాతృడైయున్నాడు ధర్మనందనా!*

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...