Sunday, January 1, 2017

పూజల పరమార్థాలు

పూజల పరమార్థాలు చాలా ఉన్నాయి.

౧. మనమీనాడు శరీరశక్తి, ప్రకృతి పదార్థాలు, రకరకాల ఐశ్వర్యాలు అనుభవిస్తున్నామంటే అది భగవంతుని ప్రసాదం. ఈ భావం నిలబడడానికే పూజ. ఇది ఒక కృతజ్ఞతా భావం.

౨. ఈ పూజలవల్ల చిత్తశుద్ధి ఏర్పడి జీవన పరమార్ధమైన భక్తిజ్ఞానాలు లభిస్తాయి.

౩. గ్రహదోషాలరీత్యా, ప్రారబ్ధ కర్మలననుసరించి అనుభవించే దుఃఖరోగ దారిద్ర్యాపదలను తొలగించే శక్తి పూజలకుంది.

మీరు చెప్పిన సంపన్నులు, విద్యావంతులు గత జన్మలలో భగవదారాధన చేసి ఉంటేనే ఈ జన్మలో అనుభవించగలుగుతున్నారు. వాళ్ళు కూడా ‘నాస్తికులు’ కాదు కదా! వారికి తెలిసిన భాషలో, పద్ధతిలో వారూ దైవానికి కృతజ్ఞతలు చెప్తూండవచ్చు.

పూజలు చేసినంత మాత్రాన సంపద, జ్ఞానం వస్తాయని శాస్త్రాలు ఎన్నడూ చెప్పలేదు. ‘ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి’, ‘ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీః’ అని మన ప్రాచీనులు – ప్రయత్నాల ద్వారానే, శ్రమతోనే కార్యసిద్ధి, లక్ష్మీప్రాప్తి లభిస్తాయని చెప్పారు. అయితే ప్రయత్నానికీ శ్రమకీ దైవశక్తి తోడు కోసం పూజ సహకరిస్తుంది.

లోకంలో ఏ వ్యాయామమూ, ఏ ఔషధ సేవనమూ లేకుండానే కొందరు ఆరోగ్యంగా ఉండవచ్చు. వారిని పేర్కొని ‘వ్యాయామం చేయనక్కరలేదు-మందులు వాడనవసరం లేదు’ అనే సిద్ధాంతాలను ప్రతిపాదించలేము కదా! వ్యాయామం లేకుండా ఆరోగ్యాన్ని తెచ్చుకోలేని వారు, ఔషధ సేవనంలేకుండా అనారోగ్యాన్ని తొలగించుకోలేని వారూ ఉంటారు. వారు వ్యాయామం, ఔషధాలు సేవిస్తూనే ఆహార విహారాలను క్రమబద్ధీకరించి ఆరోగ్యాన్ని సాధించవచ్చు.
పూర్వపుణ్యం లేని సామాన్యులకు కాలం కలసి రావాలంటే దేవానుగ్రహం కావాలి. అంతమాత్రాన దేవతల పూజలతోనే అన్నీ సాధించుకోగలం అననక్కరలేదు. ధర్మంతో కూడిన సత్కర్మలతోనే దేనినైనా సాధించగలమని ఋషుల మాట. మన ఉపనిషత్తులు, భగవద్గీతాది శాస్త్రాలు వ్యక్తి ప్రయత్నానికి, కర్తవ్య నిష్ఠకి ప్రాధాన్యాన్నిచ్చాయి.
మన విద్యుక్తధర్మ నిర్వహణయే పూజ. కర్తవ్య నిర్వహణ సామర్థ్యం తగిన సాఫల్యం – భగవత్కృప. వచ్చిన లక్ష్మి, విద్య సవ్యంగా వినియోగింపబడాలన్నా ఆ కృప ఉండాలి. దానికోసం కూడా పూజించాలి. మన కర్మలు భగవత్ శక్తిచేతనే చేస్తున్నామని, నిరంహకారంగా, నీతిగా చేస్తే అది అర్చనయే. ‘స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విన్దతి మానవః’(భగవద్గీత).
“మానవుడు తన కర్మతో భగవంతుని అర్చించి (నిస్వార్ధమే ఈశ్వరార్పణ)సిద్ధిని పొందుతున్నాడు”. అయినా కేవలం దానం, విద్యా మాత్రమే కాకుండా జీవితంలో ఎన్నో ప్రాధాన్యాలు అవసరాలు ఉంటాయి. మన బుద్ధిని సరియైన దిశలో ఉంచి, సత్ఫలితాలను ప్రసాదించడానికి పూజాదికాలు సహకరిస్తాయి. లక్ష్మీ, విద్య లభించినందుకైనా – వాటిని దేవతలుగా భావించి ఆరాధించడంలో అద్భుతమైన మనోభావం వ్యక్తమౌతుంది. సైన్స్ కి కూడా అందని పరమసత్యాన్ని ఐన్ స్టీన్ వంటి శాస్త్రవేత్తలు ఆనాడే అంగీకరించారు.

2 comments:

garam chai said...

nice
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/garamchai

sahithi said...

Vry nice information..everyone has to knw abt this.........we had a blog abt our tradition and culture ...Plz visit website www.teluguvaramandi.net...

సంధ్యావందనము, గాయత్రి మంత్ర విశిష్టత

మహాభారతం, అశ్వమేధిక పర్వంలో, ధర్మరాజు కోరికపై శ్రీకృష్ణ భగవానుడు, *'సంధ్యావందనము, గాయత్రి మంత్ర'* విశిష్టతను ఈవిధంగా వివరించారు. &#...